దక్షిణాసియా టెక్స్టైల్స్ రాజధానిగా తెలంగాణ
▪️ 2047 నాటికి లక్ష్యాన్ని సాధిస్తాం..
▪️టెక్స్ టైల్స్ మా డీఎన్ఏలో ఉంది
▪️’గ్రీన్ టెక్స్ టైల్ హబ్‌లను’ ప్రోత్సహిస్తాం..
▪️పారిశ్రామికవేత్తలకు ఇదే మా ఆహ్వానం
▪️ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణను 2047 నాటికి దక్షిణాసియాలోనే అగ్రగామి టెక్స్ టైల్ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 13వ ఏషియా టెక్స్ టైల్ సదస్సు (ATEXCON 2026) లో పాల్గొన్న ఆయన, ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

▪️టెక్స్ టైల్స్ మా డీఎన్ఏలో ఉంది
భారతదేశానికి వస్త్ర తయారీలో గొప్ప చరిత్ర ఉందని, శతాబ్దాల కళలు, సంప్రదాయాలు ఈ రంగాన్ని సుసంపన్నం చేశాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “నిజాం కాలం నుండే హైదరాబాద్ ముత్యాలకు, వస్త్రాలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. వస్త్ర పరిశ్రమ అనేది తెలంగాణకు కేవలం వ్యాపారం కాదు, అది మా డీఎన్ఏలో ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్ వంటివి తెలంగాణ నైపుణ్యానికి నిదర్శనాలని కొనియాడారు.
▪️మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం
దేశంలో నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేసినట్లు సీఏం రేవంత్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, విద్యుత్, నీటి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని, పారిశ్రామిక వేత్తలకు వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
▪️పత్తి చేను నుంచి పారిస్ ఫ్యాషన్ షో వరకు..
తెలంగాణలోని పత్తి పొలాలనువ లండన్, న్యూయార్క్, పారిస్ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ కేంద్రాలతో అనుసంధానం చేయాలన్నదే తన సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ సినిమా హబ్‌గా (టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్) ఎదుగుతోందని, సినిమా రంగానికి అవసరమైన ఫ్యాషన్ పరిశ్రమను కూడా ఇక్కడే అభివృద్ధి చేస్తామన్నారు.
▪️మహిళా సాధికారత – గ్రీన్ టెక్స్ టైల్ హబ్‌లు
పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ‘గ్రీన్ టెక్స్ టైల్ హబ్‌లను’ ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతికతతో డిజైన్, కట్టింగ్, స్టిచింగ్ రంగాల్లో యువతకు, ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
▪️పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
“మీ దగ్గర విజన్ ఉంటే.. సహకరించడానికి మేము సిద్ధం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం తెలంగాణలో తయారైన వస్త్రాలను ధరించేలా చేద్దాం. ఈ ప్రయాణంలో పారిశ్రామిక వేత్తలందరూ భాగస్వాములు కావాలి” అని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన టెక్స్ టైల్ ఎగ్జిబిషన్‌ను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు.

