అంతర్జాతీయ స్థాయిలో సూర్యాపేట బిడ్డ డా. ప్రవీణ్ బర్మావతుకు అరుదైన పురస్కారం
— చిలీలోని UTEM నుంచి ‘రికగ్నిషన్ ఫర్ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్–2026’ అవార్డు సాధించిన డా. ప్రవీణ్ బర్మావతు
— ఘనంగా సత్కరించిన యూనివర్సిటీ రెక్టర్ మారిసోల్ డురాన్ శాంటిస్
కోదాడ/శాంటియాగో:
సాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చి, అంతర్జాతీయ పరిశోధనా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన తెలంగాణ బిడ్డ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ప్రవీణ్ బర్మావతుకు విదేశీ గడ్డపై అరుదైన పురస్కారం లభించింది. సౌత్ అమెరికా దేశమైన చిలీలోని ‘యూనివర్సిడాడ్ టెక్నోలాజికా మెట్రోపాలిటానా’ (UTEM) ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ‘రికగ్నిషన్ ఫర్ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్–2026’ అవార్డును యూనివర్సిటీ రెక్టర్ మారిసోల్ డురాన్ శాంటిస్ చేతుల మీదుగా ప్రధానం చేశారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని బాలాజీనగర్‌కు చెందిన బర్మావత్ ప్రవీణ్ నాయక్.. మెకానికల్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ పూర్తిచేసి ప్రస్తుతం UTEMలోని మెకానికల్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లో తాను సాధించిన ఈ ఘనతకు తండ్రి మత్రియా నాయక్, కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే కారణమని ప్రవీణ్ తెలిపారు.

మూడు పోస్ట్‌డాక్టోరల్ ప్రాజెక్టులు: UTEMలో థర్మల్ ఇంజినీరింగ్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఎనర్జీ స్టోరేజ్ రంగాలకు సంబంధించి మూడు కీలక ANID–FONDECYT ప్రాజెక్టులకు స్పాన్సరింగ్ ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
సౌదీ అరేబియా సహకారం: సౌదీలోని ‘కింగ్ ఫహద్ పెట్రోలియం అండ్ మినరల్స్ యూనివర్సిటీ’ (KFUPM)తో కలిసి పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే MXene ఆధారిత సాంకేతికతపై ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా పరిశోధనలు చేస్తున్నారు.

భారత DRDO ప్రాజెక్టు: మనదేశ రక్షణ రంగానికి సంబంధించి DRDO-NSTL నిధులతో, NIT ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యంతో సాగుతున్న ‘సూపర్క్యావిటేటింగ్ టార్పెడో’ పరిశోధనలో కో-ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
డాక్టర్ ప్రవీణ్ ఇప్పటివరకు 175కు పైగా అంతర్జాతీయ ‘వెబ్ ఆఫ్ సైన్స్’ జర్నల్స్‌లో తమ పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఆయన పేరిట రెండు పేటెంట్లు ఉండగా, మూడు ప్రముఖ అకాడమిక్ పుస్తకాలకు ఎడిటర్‌గా కూడా పనిచేశారు.
ఈ సందర్భంగా UTEM మెకానికల్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఫెర్నాండో ఫ్యూయెంటెస్ గుటిరెజ్ డాక్టర్ ప్రవీణ్ సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. భారత్, చిలీ, సౌదీ అరేబియాల మధ్య శాస్త్రీయ సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన కృషి అభినందనీయమన్నారు.
