రివ్యూ: ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′

June 21, 2024 0 Comments

లేత వ‌య‌సు ప్రేమ‌ను తెర‌పై అందంగా చిత్రిస్తే ఆ సినిమా ప్రేక్ష‌కుల గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచిపోతుంది. అలాంటి కంటెంట్‌తో తాజాగా వ‌చ్చిన‌ చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా ఈ రోజు రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ: రాయ‌ల‌సీమ‌లోని పుంగనూరు గ్రామం బ్యాక్‌గ్రౌండ్‌లో జ‌రిగే క‌థ ఇది. పేద కుటుంబానికి చెందిన కుర్రాడు వాసు (ప్రణవ్ ప్రీతం) ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో ప్ర‌తిభ‌గ‌ల స్టూడెంట్. తల్లి కూలి పనులు చేస్తూ వాసును చదివిస్తుంటుంది. తండ్రి తాగుబోతు. అదే కాలేజీలో కుమారి (షాజ్ఞ శ్రీ వేణున్)పై మ‌న‌సు పారేసుకుంటాడు వాసు. ముందుగా వీరిద్ద‌రి స్నేహం మొద‌ల‌వుతుంది. స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది. తొలి ప్రేమ అనుభూతులను ఈ జంట ఎంజాయ్ చేస్తుంటారు. కొన్ని ప‌రిస్థితుల‌ వల్ల వీరి మధ్య అపార్థాలు ఏర్పడతాయి. దాంతో ఊహించ‌ని సంఘ‌ట‌న చోటు చేసుకుంటుంది. ఇంత‌కి కుమారి నిజంగానే వేరే అబ్బాయిని ప్రేమిస్తుందా? వాసుని మోసం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుందా? వాసు కుటుంబంలో జరిగిన ఘటనలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే థియేట‌ర్‌కు వెళ్లాల్సిందే.

న‌టీన‌టులు:
ఇందులో న‌టించిన ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ, రామ్ పటాస్..ఇలా కాస్టింగ్ అంతా బాగా న‌టించారు. హీరోహీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌ ట్ అయింది. ఇక మిగిలిన పాత్రధారులు తమ తమ
పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:
సినిమాను అందంగా చిత్రిక‌రించ‌డానికి ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాలేదు నిర్మాత‌లు. క్వాలిటీ బాగుంది. నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి ఒక మంచి సినిమా రూపొందించాడు. సినిమాలో ఓ చోట కూడా క‌నిపిస్తాడు ఆయ‌న‌. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. పాటలు బాగున్నాయి. కార్తీక్ రోడ్రిగజ్ పాటలు ట‌చ్ చేసే విధంగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ గుడ్ ఫీలింగ్‌ను క‌లిగిస్తాయి.

విశ్లేష‌ణ‌:
విలేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో కాలేజీ ప్రేమ‌ను అందంగా చిత్రించిన సినిమా ఇది. హీరోహీరోయిన్ల పాత్రల పరిచయాలు, ఊరి ఆహ్లాదకర పరిసరాలు, కాలేజీ ఫ్రెండ్స్‌తో వాసు చేసే కామెడీ.. ఇలా హాయిగా సాగుతుంటుంది సినిమా. కుమారి – వాసు క్యూట్ లవ్ స్టోరీ ఎంతో నాచుర‌ల్‌గా క‌నిపిస్తుంది.

90ల్లో పుట్టి పెరిగిన వాళ్లు ఈ సినిమా చూస్తే గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోళ్లితారు. తొలి ప్రేమ, తొలి ముద్దులాంటివి మనసులో గిలిగింతలు పెట్టేస్తాయి. పాత ప్రేమలు మళ్లీ గుర్తొస్తాయి. ప్ర‌తి సీన్‌ను ఎంతో స‌హ‌జంగా చిత్రించాడు ద‌ర్శ‌కుడు. ఈ ల‌వ్ ట్రాక్ స‌మ‌యంలో రొమాన్స్ సీన్ల‌కు అవ‌కాశం ఉన్నా కూడా దర్శకుడు శ్రీనాథ్ ఫ్యామిలీ ప్రేక్ష‌కులు చూసేలా హుందాగా తెరకెక్కించాడు. ఎక్కడా ఓవ‌ర్ చేయ‌లేదు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌కు ఉండే క్వాలిటీ కనిపిస్తుంది. ఈ సినిమాలో విల‌నిజం ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎలా జ‌రిగిందో చూపించి స‌ర్‌ప్రైజ్ చేస్తాడు డైరెక్ట‌ర్. యువత జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనిపై దృష్టి పెట్టాలి అనే సందేశాన్ని సూటిగా చెప్పాడు డైరెక్ట‌ర్. యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసి ఎంజాయ్ చేసే సినిమాగా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ చిత్రం ఉంటుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.

పాటలు, కామెడీ, లవ్ ఎలిమెంట్స్, క్యూట్ రొమాన్స్.. ఇలా అన్ని బాగున్నాయి. దీంతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని ఖ‌చ్చితంగా చెప్పొచ్చు.

రేటింగ్: 3.25 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *