హైదరాబాద్‌లో మరో గ్లోబల్ టెక్ కంపెనీ స్థాపన

- CLEARTELLIGENCE ఇండియా కార్యాలయం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
- హైదరాబాద్‌లోనే భారత్‌లో తన మొదటి ప్రధాన కేంద్రం
హైదరాబాద్: AI, డేటా అనలిటిక్స్ సంస్థ “CLEARTELLIGENCE” హైదరాబాద్లో తన మొదటి ఇండియా డెలివరీ, ఆపరేషన్స్ సెంటర్ స్థాపించింది. ఈ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర IT, పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శుభారంభం చేశారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. CLEARTELLIGENCE తమ ఇండియా ప్రధాన కార్యాలయానికి హైదరాబాద్ను ఎంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఉగాది తర్వాత మహేశ్వరంలో “AI సిటీ” ప్రాజెక్ట్ శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీని 200 ఎకరాల్లో సస్టైనబుల్ అభివృద్ధి చేస్తామని, అనేక గ్లోబల్ టెక్ కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు.
CLEARTELLIGENCE CEO ఓవెన్ ఫ్రివోల్డ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తాము కార్యాలయం ప్రారంభించామని, ఇందుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2011లో స్థాపించబడిన ఈ సంస్థ డేటా, అనలిటిక్స్ కన్సల్టింగ్లో ప్రత్యేకత కలిగి ఉందని పేర్కొన్నారు.
MM ఇన్ఫో టెక్నాలజీస్ ఫౌండర్ మురళీ ఈ సంస్థను హైదరాబాద్కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాజెక్ట్ వలన వందలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని ఆయన అన్నారు.
IT మంత్రి శ్రీధర్ బాబు, ఓవెన్ ఫ్రివోల్డ్, అనిల్ భరద్వాజ్ తదితరులు ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో మురళీ, హరికృష్ణ (డైరెక్టర్) పాత్రను ప్రశంసించారు.
CLEARTELLIGENCE CEO ఓవెన్ ఫ్రివోల్డ్, మేనేజింగ్ పార్టనర్ అనిల్ భరద్వాజ్, డైరెక్టర్ శ్రీధర్ సుస్వరం, MM ఇన్ఫో టెక్నాలజీస్ ఫౌండర్ మురళీ, డైరెక్టర్ హరికృష్ణ మొదలైన గణ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.