అంతర్జాతీయ చెస్‌లో హైదరాబాద్ సూపర్ ట్విన్స్ సంచలనం

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అమాయా, అనయ్ అద్భుత ప్రదర్శన
హైదరాబాద్: చిన్నారుల్లో అసాధారణ ప్రతిభ చాటుతూ అంతర్జాతీయ చదరంగ రంగంలో హైదరాబాద్‌కు చెందిన సూపర్ ట్విన్స్ — అమాయా అగర్వాల్, అనయ్ అగర్వాల్ — కొత్త చరిత్ర లిఖించారు. కేవలం 10 ఏళ్ల వయస్సులోనే అమాయా ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (WCM) టైటిల్ సాధించి, ప్రపంచంలో 10 ఏళ్లలోపు బాలికల కేటగిరీలో రెండో ర్యాంక్‌ను తన పేరిట లిఖించుకుంది.
ఇదే సమయంలో, ఆమె సోదరుడు అనయ్ అగర్వాల్ బోస్నియాలో నిర్వహించిన ఎఫ్‌ఎం బెజిలీనా ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. అంతేకాకుండా, హంగేరీ బుడాపెస్ట్‌లో నిర్వహించిన మరో అంతర్జాతీయ టోర్నీలోనూ పాల్గొని 100కు పైగా రేటింగ్ పాయింట్లు సాధించి తన ర్యాంక్‌ను మెరుగుపరచుకున్నాడు.
ఈ సందర్భంగా సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏకాగ్రా చెస్ అకాడమీ చీఫ్ కోచ్ డాక్టర్ సురేష్ చైతన్య మాట్లాడుతూ, “అమాయా అగర్వాల్ బోస్నియాలో జరిగిన చెస్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫిడే రేటింగ్‌లో ఆమె 2004 పాయింట్లు పొందింది. కేవలం రెండేళ్ల శిక్షణలో ఇంత గొప్ప విజయాన్ని సాధించడం ఏకాగ్రా చెస్ అకాడమీకే గర్వకారణం,” అని తెలిపారు.
సూపర్ ట్విన్స్ తల్లి పనాషా అగర్వాల్ మాట్లాడుతూ, “ఇండస్ పబ్లిక్ స్కూల్‌లో నాలుగో తరగతిలో చదువుతున్న మా పిల్లలు అమాయా, అనయ్‌ల ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించి శ్రద్ధగా శిక్షణ ఇచ్చిన డాక్టర్ సురేష్ చైతన్య గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం,” అని చెప్పారు.
అమాయా, అనయ్‌ల ప్రతిభతో చెస్ ప్రపంచంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు లభించిందని, ఈ విజయం వారి భవిష్యత్తు కోసం బలమైన అడుగు పడినట్లుగా భావించవచ్చు.