విజయవాడలో వైభవంగా ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’

October 17, 2026 0 Comments

ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు

విజయవాడ: సంప్రదాయ సంస్కృతికి ఆధునిక హంగులు అద్దుతూ, నగర ప్రజల్లో పండుగ ఉత్సాహాన్ని నింపిన ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ వేడుకలు విజయవాడలో అత్యంత అట్టహాసంగా ముగిశాయి. వైబ్ ఈవెంట్స్, ప్రముఖ లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ వేగా జ్యువెలర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ సాంస్కృతిక సంబరానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చి, తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. దసరా శరన్నవరాత్రుల వేళ కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ నగరంలో భక్తి, సంస్కృతి, వినోదాల మేళవింపుగా ఇటువంటి ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్ తమ బృందంతో అందించిన అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీజేల ఆధునిక సంగీత హోరు, పంజాబీ ధోల్ వాయిద్యాల మోతతో ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ మారుమోగగా, యువత, మహిళలు, కుటుంబ సమేతంగా సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని దాండియా, గర్బా నృత్యాలతో ఉత్సాహంగా సందడి చేశారు. దైనందిన వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందుతూ, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపేందుకు ఈ వేదిక ఎంతో దోహదపడిందని నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు.

అతిథుల కోసం స్థానిక రుచులను అందించే ఫుడ్ స్టాళ్లు, ప్రత్యేక మాక్‌టెయిల్ కౌంటర్లు, ఫేస్ పెయింటింగ్, కలర్‌ఫుల్ గాజుల దుకాణాలు, మాగ్నెటిక్ ఫొటో బూత్‌లు, సెల్ఫీ పాయింట్లు మరియు వివిధ సంప్రదాయ పోటీలను నిర్వహించి పండుగ వాతావరణాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వేగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా మాట్లాడుతూ, నవరాత్రుల ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు విలువలను కాపాడుతూ విజయవాడ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలపరచుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమా పేర్కొన్నారు. సంప్రదాయ కళారూపాలను ఆధునిక ధోరణులతో జోడించి నిర్వహించిన ఈ ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ విజయవాడ ప్రజలకు మరపురాని తీపి గుర్తుగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *