తరిగొప్పులలో TDF ‘స్నేహిత ఫుడ్స్’ ఆరంభం – రైతు కుటుంబాల మహిళలతో కొత్త అడుగు

September 26, 2025 0 Comments

తరిగొప్పుల (జనగామ జిల్లా): తరిగొప్పుల మండల కేంద్రంలో టీడీఎఫ్ సహకారంతో స్నేహిత ఫుడ్స్ అనే ఆహార ఉత్పత్తుల సంస్థ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి, సుభిక్ష అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్ నరేందర్ గరిడి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ఈ ప్రాసెసింగ్ యూనిట్‌ను తరిగొప్పుల మండలానికి చెందిన రైతు ఆత్మహత్యల కారణంగా ఒంటరి అయిన మూడు కుటుంబాల మహిళలు కలిసి స్థాపించారు. అమెరికా అట్లాంటా టీడీఎఫ్ చాప్టర్ ఆర్థిక సహకారంతో ఈ యూనిట్ ఏర్పడింది. ఈ సందర్భంగా టిడిఎఫ్ యూఎస్ఏ అధ్యక్షుడు శ్రీనివాస్ మణికొండ, అట్లాంటా చాప్టర్ సభ్యులు స్వాతి సూది, తోట గణేష్, వాణి గడ్డంను స్థానిక సభ్యులు అభినందించారు.

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వనితా చేత ప్రాజెక్ట్, జై కిసాన్ ప్రాజెక్ట్‌ల ద్వారా మహిళలు, రైతులు స్వావలంబన దిశగా ముందుకు సాగేందుకు ఫోరం కృషి చేస్తోందని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మహిళలకు కుట్టుమిషన్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలలో శిక్షణ ఇచ్చి, స్కిల్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాలు కల్పించి, పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నామని ఆయన వివరించారు.

మహిళలు ముందుకు వచ్చి అభివృద్ధి సాధించాలని వ్యవసాయ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిఎఫ్, సుభిక్ష బృందాలు, స్థానిక రాజకీయ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *